శాస్త్రిగారికి దండం పెట్టండి.
ఆయన మహా పండితుడు.
వేదాల్ని అధ్యయనంచేశాడు.
సంస్కృతాన్ని అవుపోసన పట్టాడు.
శాస్త్రాలలో దిట్ట.
సంస్కృత శ్లోకాలను అవలీలగా చెప్పేస్తుంటాడు.
శాస్త్రిగారికి దండం పెట్టండి.
ఆయన సంస్కృత భాషా ప్రచారమే జీవన ధ్యేయంగా పనిచేస్తూంటాడు.
ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ఆయన ప్రొఫెసర్.
ఆయన అనునిత్యం సంస్కృతం గురించే తపిస్తూంటాడు.
సంస్కృతం తప్ప ఆయనకు మరొక ధ్యాస లేదు.
శాస్త్రిగారికి దండం పెట్టండి.
ఆయన్ని కాబూల్ యూనివర్సిటీ సంస్కృతం నేర్పించేందుకు ఆహ్వానించింది.
ఆయన సంస్కృత పాండిత్యం చూసి తాలిబాన్లు సైతం ఆయనకి శిష్యులయ్యారు.
తమ కంచుకోటల్లోకి పిలిపించి, మాట్లాడి పంపించేశారు.
శాస్త్రిగారికి దండం పెట్టండి.
కంచి శంకరాచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వాములు శాస్త్రిగారిని ఆశీర్వదించడమే కాదు. సన్మానించారు కూడా.
శాలువ కప్పించారు. జ్ఞాపిక ఇప్పించారు.
ఆయన కృషిని ప్రశంసించారు.
శాస్త్రిగారికి దండం పెట్టండి.
ఆయన సంస్కృతంతో పాటూ కురాన్ నూ పుక్కిట పట్టారు.
సురాలు, ఆయత్ లూ ఆయనకు కంఠోపాఠం.
హిందూ శాస్త్రాల్లో ఉన్నదీ, కురాన్ లో చెప్పిందీ ఒకటేనని ఆయన అంటారు.
అంతే కాదు. కురాన్ లోని చాలా అంశాలకు హిందూ శాస్త్రాలే ప్రేరణ అంటారు.
శాస్త్రిగారికి దండం పెట్టండి
ఆయన చేసిన సేవలకు, మత సామరస్యానికి ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయన్ను నేషనల్ కమ్యూనల్ హార్మొనీ అవార్డు నిచ్చి సత్కరించింది.
2010 లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయనకు ఈ అవార్డునిచ్చారు.
ఆ సభలో ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కూడా ఉన్నారు.
శాస్త్రి గారికి దండం పెట్టండి.
శాస్త్రిగారు ముక్కుసూటి మనిషి. ఉన్నదున్నట్టు మాట్లాడేస్తారు.
తనకు ప్రేరణ ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ జీ నుంచే వచ్చిందంటారు. ఆరెస్సెస్ ఒక జాతీయవాద సంస్థ అంటారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలు బలపడితేనే దేశం బాగుపడుతుందంటారు ఆయన.
శాస్త్రిగారికి దండం పెట్టండి.
ఇంతకీ శాస్త్రిగారి పూర్తి పేరేమిటో చెప్పనే లేదు కదూ?
ఆయన పూర్తి పేరు ఆచార్య మహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి.
శాస్త్రి చదువుల వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రిలాంటి డిగ్రీ అది.
శాస్త్రిగారికి మనస్ఫూర్తిగా దండం పెట్టండి!!
Source : Rakalokam
No comments:
Post a Comment